హైదరాబాద్ : రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం చేస్తున్న
ప్రభాస్...ఈ చిత్రంలో రాజు పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా
ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఆయన ఇందులో రాజ్ పుత్ చక్రవర్తి
పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రియురాలు
సంయోగిత పాత్రలో అనుష్క కనిపించనున్నట్లు సమాచారం.
పృథ్వీరాజ్ చౌహాన్(1168-1192 క్రీ.శ ) రాజపుత్ర వంశమైన చౌహాన్ వంశానికి
చెందిన ప్రముఖ చక్రవర్తి. ఈయన 12వ శతాబ్దపు రెండవ అర్ధభాగంలో ఉత్తర
భారతదేశాన్ని పాలించాడు. పృథ్వీరాజు ఢిల్లీని పాలించిన రెండవ చివరి హిందూ
చక్రవర్తి. 11 ఏళ్ల వయసులో 1179లో సింహాసనాన్ని అధిష్టించిన పృథ్వీరాజు
అజ్మీరు మరియు ఢిల్లీలు జంట రాజధానులుగా పరిపాలించాడు. ప్రస్తుత రాజస్థాన్
మరియు హర్యానా రాష్ట్రాలలోని చాలామటుకు ప్రాంతం పృధ్వీరాజు పాలనలో ఉన్నది.
ఈయన విదేశీయుల దండయాత్రలకు వ్యతిరేకంగా రాజపుత్రులను సంఘటితం చేశాడు.
పృథ్వీరాజు, కనౌజ్ ను పరిపాలించిన ఘడ్వాల రాజు జయచంద్ర కూతురైన సంయుక్త
(సంయోగిత) ను లేవదీసుకొనిపోయి పెళ్ళి చేసుకోవటం భారతదేశపు జనసాహిత్యంలో
చాలా ప్రసిద్ధమైన ప్రేమకథ. పృథ్వీరాజు ఆస్థానకవి, స్నేహితుడైన చంద్ బర్దై
వ్రాసిన పృథ్వీరాజ్ రాసో అనే కావ్యం ఈ కథపై ఆధారితమైనదే.
ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని
తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం
కోసం ఎంపిక చేస్తున్నాడు. తాజాగా యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం
ఏమిటంటే ఈ చిత్రంలో మాజీ స్టార్ హీరోయిన్స్ శ్రీదేవి లేదా సుస్మితా సేన్
నటించబోతున్నట్లు తెలుస్తోంది.
శ్రీదేవి లేదా సుస్మితాసేన్ ఈ చిత్రంలో ప్రభాస్, రాణా తల్లి పాత్రలో
నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు.
త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. వీరికి రెమ్యూనరేషన్
కోటికిపైగానే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సినిమాను 70 నుంచి 80 కోట్ల భారీ
బడ్జెట్ తో నిర్మించాలని డిసైడ్ అయిన నిర్మాత దేవినేని ప్రసాద్ ఖర్చుకు
ఏమాత్రం వెనకాడటం లేదని, వారిని తీసుకోవడానికి రాజమౌళికి గ్రీన్ సిగ్నల్
ఇచ్చాడని సమాచారం.
ఈగ సినిమాలో విలన్ పాత్ర పోషించిన కన్నడ నటుడు సుదీప్ ఈ చిత్రంలో ఓ చిన్న
పాత్రను పోషించనున్నాడు. ఇటీవల వన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ
విషయం వెల్లడించారు. పంజా చిత్రంలో విలన్ పాత్ర పోషించిన అడవి శేష్
‘బాహుబలి' చిత్రంలో కీలకమైన పాత్రకు ఎంపికయ్యాడు. అదే విధంగా తమిళ నటుడు
సత్యరాజ్ కబ్బా అనే పాత్రకు ఎంపికయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలో సెట్స్‌పైకి
వెళ్ల నుంది. ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ఈచిత్రాన్ని
తెరకెక్కిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రామా రాజమౌళి
కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా
పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. మరో వైపు
ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు
సంబంధించిన సెట్టింగ్స్ వేసే పనిలో బిజీగా ఉన్నారు.
No comments:
Post a Comment